Sunrisers Hyderabad Abrar Ahmed Controversy | ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం ప్రస్తుతం పెను వివాదంలో చిక్కుకుంది. ఇంగ్లాండ్‌లో జరిగే ‘ద హండ్రెడ్’ (The Hundred) లీగ్‌లో సన్ గ్రూప్ యజమాని కావ్య మారన్, ‘సన్‌రైజర్స్ లీడ్స్’ జట్టు తరఫున పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) ను కొనుగోలు చేయడం ఈ దుమారానికి కారణమైంది.
వివాదానికి అసలు కారణం ఇదే..
గతంలో అబ్రార్ అహ్మద్ భారత ఆర్మీని హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. భారత సైన్యాన్ని ఎగతాళి చేసిన ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. కొందరైతే ఏకంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
బీసీసీఐ క్లారిటీ: మాకు సంబంధం లేదు
ఈ అంశంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల స్పందిస్తూ.. విదేశీ లీగ్‌లలో ఫ్రాంచైజీల కొనుగోళ్లలో బోర్డు జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అయితే, వివాదం ముదురుతున్న తరుణంలో ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది.
సన్‌రైజర్స్‌కు ఊరటనిచ్చే వార్త: అబ్రార్ ఆడటం కష్టమే!
తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్ ‘ద హండ్రెడ్’ లీగ్‌లో అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగడం కష్టంగా కనిపిస్తోంది.
జూలై 21 నుండి ఆగస్టు 16 వరకు ‘ద హండ్రెడ్’ లీగ్ జరగనుండగా.. సరిగ్గా అదే సమయంలో పాకిస్థాన్ జట్టు వెస్ట్ ఇండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు జూలై 15న బయలుదేరనుంది.
జాతీయ జట్టుకు ఆడాల్సి ఉన్నందున అబ్రార్ అహ్మద్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఒకవేళ అబ్రార్ ఈ లీగ్‌కు దూరమైతే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శల నుండి సన్‌రైజర్స్ యాజమాన్యానికి పెద్ద ఊరట లభించినట్లే అవుతుంది.







