Fraudster sukesh alleges ktr and kavitha
Hyderabad| ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న ఘరానా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ కేటీఆర్, కవితల పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ మరో లేఖను విడుదల చేశాడు.
తెలంగాణ గవర్నర్ తమిళసై, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరెక్టర్ లకు ఈ లేఖను పంపించాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం లేకుండా కేటీఆర్,కవితలతో తనకు రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టు సుకేశ్ సంచలన ఆరోపణలు చేశాడు.
కవితకు, తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు, లావాదేవీలపై కోర్టుకు, హైపవర్ కమిటీకి సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలని అలా చేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద స్థలం, రూ.100 కోట్ల నగదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కేటీఆర్, కవితకు సంబంధించిన సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని సుకేశ్ లేఖలో పేర్కొన్నారు.
వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోలేని పక్షాన తనకు దారుణమైన పరిస్థితి ఎదురవుతుందని కేటీఆర్,కవిత సన్నిహితులు బెదిరిస్తున్నట్లు సుకేశ్ ఆరోపించాడు.
ఈ వాంగ్మూలంతో పాటు ఆమ్ ఆద్మీ నేతలతో తాను జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు, ఫేసెటైమ్ కాల్ హిస్టరీ కాపీలు, రికార్డులను కూడా ఇచ్చేయాలంటున్నారని సుకేశ్ లేఖలో ప్రస్తావించాడు.
కేటీఆర్, కవితలతో తాను జరిపిన రూ.2 వేల కోట్ల లావాదేవీల పైన దర్యాప్తు జరిపితే కేటీఆర్,కవితలు ఎంతటి అవినీతి పరులో తెలుస్తుందని సుకేశ్ తెలిపాడు.
కవిత,కేటీఆర్ లతో జరిపిన చాట్ లు, కాల్ రికార్డింగ్ లు కలిపి దాదాపు 250 జిబీకి పైగా డేటా ఉందని స్పష్టం చేశాడు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను సుకేశ్ ఈ లేఖలో కోరాడు.
ఆరోపణలపై స్పందించిన కేటీఆర్..
Ktr response| సుకేశ్ చేసిన ఆరోపణలపైన తెలంగాణ ఐటి మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“భ్రమ కలిగించే మోసగాడు మరియు ప్రముఖ నెరస్థుడు అయిన సుకేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలిసింది.
నేను ఈ పోకిరీ గురించి ఎన్నడూ వినలేదు మరియు అతని అర్ధంలేని మాటల వల్ల అతనిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను.
ఫిబ్‌స్టర్‌ల నుండి ఇటువంటి క్రూరమైన వ్యాఖ్యలు/క్లెయిమ్‌లను ప్రచురించేటప్పుడు మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్దిస్తున్న” అని కేటీఆర్ స్పందించారు.