Singareni begins coal mining at Naini block in Odisha | సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి.
దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించింది. నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బయటి రాష్ట్రంలో తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తు తరాలకు సింగరేణి బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు. సింగరేణి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక ప్రకటన జారీ చేశారు. తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.