Siggis Digital Detox | ప్రస్తుతం టెక్ ప్రపంచంలో మొబైల్ (Mobile Phone) వాడకం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో రోజు గడవడానికి మొబైల్ అంతే అవసరం అనేంతలా పరిస్థితులు మారిపోయాయి.
అవసరాలకు మించి సెల్ ఫోన్ ఒక వ్యసనంలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మొబైల్ రేడియేషన్ కారణంగా కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ను పరిమితంగా వాడాలని చెప్పే ఉద్దేశ్యంతో అమెరికాకు చెందిన సిగ్గీస్ (Siggis) అనే డెయిరీ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
డిజిటల్ డిటాక్స్ (Digital Detox) అనే పేరుతో నెల రోజులు ఫోన్ కు దూరంగా ఉంటే.. పదివేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8.30 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది.
అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ లాక్ బాక్స్, ఆకర్షణీయమైన ప్లిఫ్ ఫోన్, ఒక నెలపాటు ఉచితంగా వాడుకునే విధంగా ప్రీపెయిడ్ సిమ్ కార్డ్, మూడు నెలల పాటు వాడుకునే విధంగా సిగ్గి యూ గర్ట్ ను అందిస్తామని ప్రకటించింది.
ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ పోటీలో పాల్గొనాలని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. ఛాలెంజ్‌పై ఆసక్తి ఉన్నవారు తమకు డిజిటల్ డిటాక్స్ ఎందుకు అవసరమో వివరిస్తూ 100 నుండి 500 పదాల వ్యాసాన్ని జనవరి 31లోగా సమర్పించాలి.