Rahul Gandhi backs Thalapathy Vijay’s ‘Jana Nayagan’ | తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు మద్దతుగా నిలిచారు లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ. విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు సెన్సార్ బోర్డు సెర్టిఫికేట్ జారీ చేయకపోవడంతో విడుదల వాయిదా పడింది. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన విజయ్ ఇదే తన చివరి సినిమా అని ప్రకటించారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఈ సినిమా చిక్కుకుంది. ఇదే సమయంలో రాజకీయ కారణాలతోనే జన నాయగన్ సినిమాకు కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తోందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకోవడంతో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జన నాయగన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి అని అభివర్ణించారు. తమిళ ప్రజల గొంతును అణిచివేయడంలో ప్రధానమంత్రి మోదీ ఎప్పటికీ విజయం సాధించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు.









