Padma Shri Awardee ‘Vanajeevi’ Ramaiah passes away | పర్యవరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కోటికి పైగా మొక్కలు నాటి పుడమి తల్లికి ఆయన చేసిన సేవ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
వనజీవి రామయ్య మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా, రెడ్డిపల్లి గ్రామంలో 1937లో లాలయ్య, పుల్లమ్మ దంపతులకు దరిపల్లి రామయ్య జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. రామయ్య, కోట్లాది మొక్కలు నాటి “వనజీవి” అనే బిరుదును స్వంతం చేసుకున్నారు.
బాల్యం నుండే గ్రామంలోని పొలాలు, గుట్టలు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు, అక్కడ చెట్టు నాటాలనే ఆలోచన ఆయన మదిలో మొదలయ్యింది. “చెట్లు నాటితే వర్షాలు వస్తాయి, నీడ దొరుకుతుంది, భవిష్యత్తు బాగుంటుంది” అనే నమ్మకంతో ఆయన ముందుకు సాగారు. వేసవిలో విత్తనాలు సేకరించి, వర్షాకాలం వచ్చినప్పుడు వాటిని రోడ్ల పక్కన, గుట్టలపై, ఖాళీ స్థలాల్లో చల్లేవారు.
ఆయన వృత్తిరీత్యా కుండలు తయారుచేసేవారు, పాలు అమ్మేవారు. కానీ, ఆయన జీవితంలో అసలైన ఆనందం మొక్కలు నాటడంలోనే ఉండేదని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని రామయ్య తన జీవితంలో ఆచరించారు. ఈ నినాదం రాసిన ప్లకార్డులతో ఆయన పర్యావరణ కార్యక్రమాలకు వెళ్లేవారు.
రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను, వాటి ఉపయోగాలను తేలిగ్గా వివరించగలిగే అపార జ్ఞానం సంపాదించారు. వనజీవి రామయ్య తన జీవిత కాలంలో కోట్లాది మొక్కలకు పైగా నాటారు. రామయ్య గొప్ప కృషిని గుర్తించి, భారత ప్రభుత్వం 2017లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
అంతేకాదు, 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ నుండి “వనమిత్ర” అవార్డు, యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నుండి డాక్టరేట్ వంటి ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో, మహారాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. ఆయన మరణం పర్యావరణ ప్రేమికులకు తీరని లోటు.