Petrol Bunks | కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేశారు.
దీంతో భారీ స్థాయిలో ఇంధన రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతాయని ముందు జాగ్రత్తగా వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్‌లకు పోటెత్తారు. ఈ కారణంగా హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల్లో తీవ్ర రద్దీ నెలకొంది.
పెద్ద పెద్ద క్యూలైన్లో వేచి ఉండి వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటున్నారు. పలువురు ఖాళీ క్యాన్లతోనూ క్యూ కట్టారు. జనం పోటెత్తడంతో హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేస్తు్న్నారు. తాజా సమాచారం మేరకు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు.
హెచ్ పి, బిపిసి, ఐఓసి ఆయిల్ కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. సాయంత్రం సమయంలో పలు బంకులకు చేరుకోనున్నాయి.
రాత్రి వరకు అన్ని బంకులలో యధావిధిగా పెట్రోల్ డీజిల్ నిల్వ ఉండే అవకాశం ఉంది. దీంతో ఆందోళన అక్కర్లేదని బంకుల యజమానులు చెబుతున్నారు.