Tuesday 31st March 2026
12:07:03 PM
Home > క్రీడలు > సీఎంపై విమర్శలు.. పాక్ బౌలర్ నసీమ్ షాకు భారీ ఫైన్!

సీఎంపై విమర్శలు.. పాక్ బౌలర్ నసీమ్ షాకు భారీ ఫైన్!

fine on pak bowler

Fine On Pak Bowler | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని రాజకీయ నాయకులపై, ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ పెనాల్టీ విధించింది.

ఏకంగా 20 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు (సుమారు రూ.67 లక్షల భారత కరెన్సీ) జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి?
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్రమైన ఇంధన, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రారంభమైంది.

గ్యాస్ కొరత కారణంగా స్టేడియాల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ అభిమానులను మ్యాచులకు అనుమతించకూడదని పీసీబీ నిర్ణయించింది.

సామాన్య ప్రజలకు అనుమతి లేని సమయంలోనే, లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన పీఎస్ఎల్ తొలి మ్యాచ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు.

ముఖ్యమంత్రికి మాత్రమే ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించడంపై నసీమ్ షా అసహనం వ్యక్తం చేశారు. “సాధారణ ప్రజలకు లేని అనుమతి ఆమెకు ఎలా ఉంది? ఈ ముఖ్యమంత్రిని ఎందుకు రాణిలా (Queen) ట్రీట్ చేస్తున్నారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో పాక్ రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. ముఖ్యమంత్రిని విమర్శించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, ఇది బోర్డు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పీసీబీ పేర్కొంది.

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నసీమ్ షా వార్షిక వేతనం నుండి ఈ భారీ మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించింది. గతంలో కూడా పాక్ క్రికెటర్లు రాజకీయాలపై స్పందించి చిక్కుల్లో పడ్డారు, కానీ ఒక పోస్ట్ కు ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions