Insurance For TDP Followers | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లోని అధికార తెలుగు దేశం పార్టీ (TDP) తమ కార్యకర్తలకు బీమా (Insurance) సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రూ.100 చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు, రూ.5 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు.
ఈ మేరకు కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం విధించిన కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసినట్లు లోకేశ్ వివరించారు.
మరణించిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.