MP Eatala Rajender vs MLA Marri Rajashekar Reddy | ఎంపీ ఈటల రాజేందర్ మరియు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో బీజేపీ, బీఆరెస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేయడం కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేడ్చల్ జిల్లాలోని మచ్చబొల్లారంలో అల్వాల్, బోలారం రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పనులకు ఈటల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
అయితే ఈ పనులకు సంబంధించి నిధులు తాము తెచ్చామంటే తాము తెచ్చామనే వాదన మొదలైంది. అనంతరం ఇది వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతల పరస్పర ఆరోపణలు, వాదనలు కార్యకర్తల నినాదాలతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కలుగజేసుకుని ఇరు పక్షాలను సముదాయించారు.









