Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక’

‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక’

komatireddy venkat reddy

‌‌‌

  • పేదవాడు చదువుకోవాలి.
  • చదువుతోనే అభివృద్ధి సాధ్యము
  • సాధారణ రైతు బిడ్డగా ఇక్కడికి వస్తే నా నల్గొండ ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు
  • నాకు అన్ని సందర్భాల్లో వెన్నుదన్నుగా నిలిచారు..మీకు ఎంత చేసినా తక్కువే
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Bottuguda School | కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ (Komatireddy Pratheek Foundation) ఆధ్వర్యంలో సుమారు రూ. 8కోట్లకు పైగా వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు.

బొట్టుగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీ, పాఠశాల ఇండోర్ గేమ్స్, ఔట్ డోర్,ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్ లు, అన్నింటిని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కలియతిరిగారు. విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు.

ఐఏఎస్,ఐపీఎస్,సైంటిస్ట్ లే కాకుండా గొప్ప సృజనాత్మకత కలిగిన పౌరులుగా ఎదిగేలా లక్ష్యాలు పెట్టుకోవాలని మంత్రి వారికి సూచించారు. మీరు ఉద్యోగాల కోసం వెళ్లడం కాదు..మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థిని,విద్యార్థులకు హిత బోధ చేశారు.

గూగుల్ సీఈఓ, మైక్రోఫాస్ట్ సీఈఓ ఇండియాకు చెందిన వారని అట్లాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఎదిగి నల్లగొండకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులు ఈ సందర్భంగా పరిశీలించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల కోరిక మేరకు వారితో ఫోటోలు దిగి వారిలో నూతనఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేకుండా నిర్వహిస్తున్న బొట్టు గూడ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టి, అధునాతన హంగులు కల్పించాలన్నది తన చిరకాల కోరిక అని అన్నారు.

2500 గజాల స్థలంలో అన్ని అత్యాదునిక వసతులతో బొట్టుగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను నిర్మించడం జరిగిందని, పేదవాడు చదువుకోవాలని ,చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. బొట్టు గూడ ప్రభుత్వ ప్రాథమిక ,ఉన్నత పాఠశాల రొటీన్ పాఠశాల కాదని, సంప్రదాయ విద్య కాకుండా అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఒక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా వాల్డాఫ్ విద్యా విధానాన్ని ఈ పాఠశాలలో అమలు చేయడం జరుగుతుందన్నారు.

పాత సిలబస్ తో పాటు, సీబీఎస్ఈ ని కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాఠశాల ద్వారా అనుభవాత్మక విద్యను నేర్పించడం జరుగుతుందని తెలిపారు.
“ఈ రోజుల్లో మనం చూస్తున్న సంప్రదాయ విద్య, ఎక్కువ మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోంది.
పిల్లలను ఆలోచించేందుకు కాకుండా కేవలం గుర్తుపెట్టుకుని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తోంది.
ఈ ఒత్తిడిలో పిల్లల సహజ కుతూహలం, సృజనాత్మకత నశించిపోతున్నాయి.

చదువు ఒక ఆనందకరమైన ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతోంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతోనే మేము వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొందాం. వాల్డార్ఫ్ విద్య ప్రకారం పిల్లలు మూడు విధాలుగా ఎదగాలి – ఆలోచన,అనుభూతి,కార్యాచరణ. అందుకే మా పాఠశాలలో అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

గార్డెన్ పనుల ద్వారా సహనం నేర్పిస్తున్నాం, ప్రకృతితో అనుబంధం పెంచుతున్నాం. కుండల తయారీ, రాయి చెక్కుదల ద్వారా ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంపొందిస్తున్నాం. ఇసుకతో ఆటల ద్వారా పిల్లల కల్పనాశక్తిని విస్తరిస్తున్నాం. నృత్యం, యోగా ద్వారా శరీరం–మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం.
ఇండోర్ ఆటల ద్వారా సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంచుతున్నాం.

అదే సమయంలో పిల్లలు ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించలేదు.
అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ విద్య పరిచయం, మంచి గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్, లిఫ్ట్ సదుపాయం, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్— ఇవన్నీ పిల్లలకు బలమైన సాంకేతిక అవగాహన ఇవ్వడానికే.

ఈ పాఠశాల సంప్రదాయ విద్యకు, వాల్డార్ఫ్ ప్రేరణతో కూడిన విద్యకు మధ్య ఉన్న సమతుల్యమైన సమ్మేళనం. పాఠ్యాంశాలు మారవు. కానీ వాటిని నేర్చుకునే విధానం మాత్రం మారుతుంది. అదే విషయాల్లో సృజనాత్మకతను, కార్యాచరణను, జీవన నైపుణ్యాలను జోడిస్తున్నాం.

అందుకే మా పిల్లలు బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్నారు. వారు పరీక్షలకు సిద్ధంగా ఉంటారు, వృత్తులకు సిద్ధంగా ఉంటారు, అంతకంటే ముఖ్యంగా పోటీజీవితానికి సిద్ధంగా ఉంటారు.

నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత నైపుణ్యాల పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మించడం జరిగిందని తెలిపారు. ఉస్మానియా ,కాకతీయ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీనే అతిపెద్ద యూనివర్సిటీగా ఉందని, ఇటీవలే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎల్ ఎల్ బి ,బీ ఫార్మసీ, కోర్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎస్ఎల్ బిసీ వద్ద నిర్మిస్తున్నామని ,రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్య నేర్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

నల్గొండ అభివృద్ధిలో భాగంగా 800 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొని రావడం జరిగిందని, రానున్న రెండేళ్లలో నల్గొండ రూపురేఖలను మార్చడం జరుగుతుందని అన్నారు.

బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల ద్వారా మంచి విద్యను అందించడం పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ,పాఠశాల ద్వారా ఆణిముత్యాల లాంటి విద్యార్థులను తయారు చేయాలని, ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్టులను తీర్చిదిద్దాలని, అలాగే పేదవారి చదువు కోసం సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బొట్టు గూడ పాఠశాల ప్రవేశాల ఆధారంగా అవసరమైతే అదనపు గదులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు .

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బొట్టు గూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను 8 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించడం అభినందనీయమని అన్నారు.

ఈ పాఠశాలలో చదువుతోపాటు, ఇతర కార్యక్రమాలను నేర్పించడం జరుగుతుందని, నేర్చుకోవాలనే తపనతోనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్టిఫిషియల్ అభ్యసన ద్వారా విద్యను అందించడం జరిగిందని, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్స్ సైతం ఈ పాఠశాలకు డెప్యూటషన్ పై పంపడం జరిగిందన్నారు.

పాఠశాల ద్వారా మంచి పౌరుడిగా ,బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బొట్టుగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపయోగపడుతుందన్నారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశంలోనే బొట్టుగూడ లాంటి పాఠశాల ఉండదన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యులు హఫీజ్ ఖాన్,ప్రతీక ఫౌండేషన్ సీఈఓ గోనా రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి లు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు అధికారులు, పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు

You may also like
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ponguleti srinivasa reddy
దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions