Chiranjeevi About Cancer | వరల్డ్ కాన్సర్ డే (World Cancer Day) సందర్బంగా హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ (KIMS)లో కాన్సర్ పై అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలన్నారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
గతంలో తన స్నేహితుడు ఒకరు క్యాన్సర్ బారిన పడితే వెంటనే గమనించి వైద్యం తీసుకోవడం వల్ల దాన్ని నివారించగలిగారని చెప్పారు.
అందుకే శరీరం చెప్పే మాట అందరూ వినాలనీ.. నాకు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. మన జీవనశైలి, అలవాట్లు, వాతావరణంతోపాటు వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.
క్యాన్సర్ ను మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90 శాతం నివారించే అవకాశం ఉందని తెలిపారు. అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేయించడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడొచ్చని పేర్కొన్నారు.
మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలనీ, వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు. అందరూ జీవనశైలిలో మార్పులు చేసుకుని ఆరోగ్యకరమైన వాటిని తినాలని సూచించారు. భవిష్యత్తులో క్యాన్సర్ పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్స్ కూడా తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పారు.






