Medaram News Latest | ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఘనంగా సాగుతోంది. జాతరలో భాగంగా రెండవ రోజు గురువారం అద్భుత దృశ్యం భక్తులను పరవశించేలా చేసింది. చిలకగుట్టను వీడి సమ్మక్క జనంలోకి ప్రవేశించింది. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దింతో మేడారం జనసంద్రంగా మారిపోయింది. చిలకలగుట్ట వనం వీడి సమ్మక్క తల్లి జనంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో సమ్మక్కకు అధికారికంగా స్వాగతం పలుకుతూ ములుగు ఎస్పీ రామనాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
పూజారులు కుంకుమ భరణేతో వనాన్ని వీడుతుంటే కాల్పుల శబ్దం, భక్తుల కేరింతలతో మేడారం హోరెత్తింది. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపై కొలువుతీరనుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి 12 తర్వాత గద్దెపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దీవెనలు అందించనున్నారు. ఇకపోతే సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి సుమారు కోటి మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.









