-కొందరిలో దగ్గు దీర్ఘకాలం వెంటాడుతుంది.
వింటర్‌లో వాతావరణ మార్పులతో చాలా మంది జలుబు, దగ్గు బారినపడుతుంటారు. కొందరిలో దగ్గు దీర్ఘకాలం వెంటాడుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సీజనల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో విడవని దగ్గు కూడా చాలామందిని వెంటాడుతుంది. ఈ సమస్యకు చికిత్స తీసుకోవడంతో పాటు ఆహారంలో కొన్ని పొరపాట్లకు చెక్ పెట్టడం ద్వారా సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
చలికాలంలో వేడివేడిగా నోటికి రుచి ఇచ్చే ఆహార పదార్ధాలను లాగిస్తుంటాం. అయితే ఆరోగ్యకర ఆహరం తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లలో మనం చేసే పొరపాట్లను నివారించాలి. దగ్గు బాధిస్తుంటే వెన్న, పాలు వంటి డైరీ ఉత్పత్తులను పక్కనపెట్టాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే డైరీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి.
ఇక మనం చేసే మరో పొరపాటు విషయానికి వస్తే తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత హైడ్రేషన్ లేకుంటే గొంతులో అసౌకర్యంతో హీలింగ్ ప్రక్రియ మందగిస్తుంది. ప్రాసెస్డ్, ఫ్రై ఫుడ్ తీసుకోవడం మరో పొరపాటుగా ఆహార నిపుణులు చెబుతున్నారు. దగ్గు వెంటాడుతున్నప్పుడు ఈ తరహా ఆహారాన్ని తీసుకోవడం మానివేయాలి. దీనికి బదులు పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. ద్రాక్ష, నిమ్మ, ఆరంజ్ వంటి సిట్రస్ పండ్లను పక్కనపెట్టడం మేలు. టీ, కాఫీలను పరిమిత మోతాదులో తీసుకోవాలి.