KTR Fires On Cm Revanth | సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( Brs Working President ) కేటీఆర్.రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
గురుకుల భవనాలకు అద్దె చెల్లిస్తలేరని, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ( Fee Reimbursement ) ఇస్తలేరని, కనీసం అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని నిలదీశారు. చదువు పక్కనపెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్నారు. మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటానికి పైసలు లేవా? అని ప్రశ్నించారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులకు మేలు చేయటంలో లేదా? అని సీఎంను కేటీఆర్ నిలదీశారు.