Mega Blood Donation For Thalassemia Patients | తలసేమియా అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తుంది.
శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్రరక్తకణాల్లోని ప్రొటీన్ అయిన హిమోగ్లోబిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువుల్లో ఏర్పడే మ్యుటేషన్ వల్ల తలసేమియా వస్తుంది.
తలసేమియాతో బాధపడుతున్న వ్యక్తులు అసాధారణమైన హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని కలిగి ఉంటారు. దీని ఫలితంగా ఎర్ర రక్త కణాల నాశనం మరియు ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది.
భారతదేశంలో తలసేమియా ప్రాబల్యం అధికంగా ఉంది. మన దేశంలో ఏటా సుమారు 10,000 మంది ఈ తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారు.
తలసేమియా బాధిత చిన్నారులకు చికిత్సలో భాగంగా జీవితకాల రక్తమార్పిడి అవసరం అవుతుంది. వారికి తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంది.
లేకపోతే వారు మరణించే ప్రమాదం ఉంది. భారతదేశంలోని ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలపై తలసేమియా భారం పడుతోంది.
రక్తమార్పిడి, చీలేషన్ థెరపీ ఇతర వైద్య చికిత్సల ఖర్చు చాలా కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి లేదా ఆరోగ్య సంరక్షణకు పెను ఆర్థిక భారంగా మారుతోంది.
అయితే, తలసేమియా బాధితుల కోసం, ఆ చిన్నారుల కుటుంబాలను ఆదుకోవడానికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సేవ అందిస్తున్నాయి. తలసేమియా చికిత్సా కేంద్రాలు, సహాయక బృందాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
లాభాపేక్ష లేని సంస్థలు చికిత్స, సహాయక సేవల ఖర్చుల్లో సహాయపడటానికి ఆర్థిక సాయం చేస్తున్నాయి. తలసేమియా బాధిత చిన్నారుల కోసం స్వచ్చంధ సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరచూ రక్తం సేకరిస్తుంది.
అందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కేబీకే మల్టీ స్పెషాలిటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది.
మే 8న రెడ్ క్రాస్ డే, తలసేమియా డే సందర్భంగా కేబీకే హాస్పిటల్ హయత్ నగర్ శాఖలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మానవత్వంతో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని, తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడాలని కేబీకే హాస్పిటల్, రెడ్ క్రాస్ సొసైటీ విజ్ఞప్తి చేస్తోంది.
స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనదలచిన వాలంటీర్లు 8121596699 నెంబర్ కు వాట్సాప్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచిస్తోంది.