- ఐటీ టవర్స్ లో ఆక్యుపెన్సీ కోసం ఎమ్మెల్యేకు వినతి
- సానుకూలంగా స్పందించిన కంచర్ల భూపాల్ రెడ్డి
- అనుమతి పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
నల్లగొండ: ఐటీ, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో విశేష సేవలందిస్తున్న కేబీకే గ్రూప్ నల్లగొండకు రానుంది.
ఈ మేరకు పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఐటీ టవర్ లో ఆక్యుపెన్సీ కోసం కేబీకే గ్రూప్ ప్రతినిధులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కేబీకే గ్రూప్ సీఈవో కక్కిరేణి భరత్ కుమార్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో ఫోన్ లో సంభాషించారు.
సొంత ఊరిలో కంపెనీ స్థాపించి స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో కేబీకే గ్రూప్ విభాగాన్ని తన స్వస్థలం నల్లగొండలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు.
కేబీకే గ్రూప్ ద్వారా ఐటీ, హాస్పిటల్, రియల్ ఎస్టేట్, మీడియా తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ ఐటీ టవర్ లో కార్యకలాపాలు ప్రారంభించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
భరత్ కుమార్ వినతి పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకోవాలనే భరత్ కుమార్ సంకల్పాన్ని ప్రశంసించారు.
నల్లగొండ ఐటీ టవర్స్ లో వెంటనే కేబీకే గ్రూప్ కు స్థలం కేటాయించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
కేబీకే గ్రూప్ తరఫున వీలైనంత ఎక్కువమంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గణేశ్ మారగోని, కేబీకే గ్రూప్ ప్రతినిధులు జక్కి అరుణ్ కుమార్, విశాఖ రాజేందర్ రెడ్డి, చప్పిడి శ్రీకాంత్ రెడ్డి, సావిరెడ్డి సందీప్ రెడ్డి, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.