- కర్నాటక ‘హస్త’గతం
- 136 సీట్లతో పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్
- 65 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
- 19 సీట్లకే పరిమితమైన జేడీఎస్
- సీఎం రేసులో ఇద్దరూ!
Karnataka Assembly Results | కర్నాటక ఫలితాల్లో అంతా ఊహించినట్టే జరిగిందే. దాదాపు ప్రతి ఐదేళ్ల కోసారి ప్రభుత్వం మారే ఆనవాయితీ ఈ సారి కూడా కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కర్నాటక కాంగ్రెస్ వశం అయ్యింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ గెలవాలనే ఆశలపై కన్నడిగులు నీళ్లు చల్లారు. జేడీఎస్ ను సైతం తిరస్కరించి, కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకొని అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది.
బీజేపీ 65 స్థానాల్లో గెలుపొందింది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే హంగ్ వస్తే చక్రం తిప్పాలని భావించిన జేడీఎస్ కు భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. కంచుకోట అయిన ఓల్డ్ మైసూర్ లోనూ జేడీఎస్ ప్రభావం ఏమాత్రం చూపించలేకపోయింది.
2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 56 స్థానాలు అదనంగా గెలుచుకుంది. బీజేపీ 39 స్థానాలు కోల్పోయింది. జేడీఎస్ కూడా గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 18 సీట్లు కోల్పోయింది.
బీజేపీ ఓటమితో ప్రస్తుతం సీఎం బసవరాజు బొమ్మై తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి సమర్పించే అవకాశం ఉంది.
సీఎం రేసులో ఇద్దరూ..
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సుస్పష్టమైన మెజారిటీ రావడంతో సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ కూడా సీఎం రేసులో ఉన్నారు.
పైగా ఆయన ఈ ఎన్నికల్లో గెలుపునకు విశేష కృషి చేశారు. ఇక సిద్ధరామయ్యకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఉండటం, ఎమ్మెల్యేలు సైతం ఆయన అభ్యర్థిత్వాన్నే సమర్థించే అవకాశం ఉండటంతో ఆయనకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.