Jagan Satires On Pawan | ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన (Jana Sena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) పొలిటికల్ హీట్ ని పెంచేసింది.
యాత్రలో భాగంగా పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ సీఎం జగన్ (CM YS Jagan)తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనాని ఇటీవల నర్సాపురం సభలో మాట్లాడుతూ జగన్ పై సెటైర్లు వేశారు.
జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ప్రతి దానికి బటన్ నొక్కాం, డబ్బులు వేస్తున్నాం చెప్పుకుంటారు.
వాటికి సంక్షేమ పథకాలు అని పేరు పెట్టి అభివృద్ధి ఏమి చెయ్యకుండా చేతులు దులుపుకుంటున్నారు. అని పవన్ ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా మీరు నొక్కని బటన్ లు చాలా ఉన్నాయని సీఎం ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
“పూర్తి కానీ పోలవరం, రాని ఉద్యోగ నోటిఫికేషన్స్, నష్ట పోయిన రైతుల్ని అదుకోకపోవడం, దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథాలూ,
వలసలు పోతున్న బతుకులు ఇలా చాలా వాటికి మీరు బటన్ నొక్కకపోవడమే కారణం” అని జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
Read Also: బీఆరెస్ పై అసంతృప్తి.. కారు దిగడం ఖాయం అంటున్న కీలక నేత!
అయితే పవన్ చేసిన కామెంట్లకు నేరుగా ముఖ్యమంత్రే కౌంటర్ ఇచ్చారు. బుధవారం కురుపాంలో జరిగిన జగనన్న అమ్మ ఒడి పథకం అమలు సభలో జగన్ మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థికసాయం నిమిత్తం నాలుగేళ్లలో అమ్మఒడి (Amma Odi Scheme) పథకం ద్వారా రూ. 26 వేల కోట్ల బాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
కేవలం బటన్ నొక్కడం ద్వారా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని బటన్ నొక్కడం అంటే ఇది అని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పవన్ ను ఉద్దేశించి మరోసారి సెటైర్లు వేశారు. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయాన్ని చెప్పండంటూ అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
పవన్ కళ్యాణ్ వారాహి అనే లారీ ఎక్కి యాత్ర అని చెప్పుకొని తిరుగుతున్నాడు.
ఆ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చని వారిని తాట తీస్తా అని, చెప్పుతో కొడుతా అని ఇలా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు అని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ లాగా మనం రౌడీ లాగా మీసాలు తిప్పలేం, కత్తులు పట్టలేం, నలుగుర్ని పెళ్లిళ్లు చేసుకోలేం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ వారాహి యాత్రతో రాజకీయం అంతా వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది.
ఎన్నికలకు ఏడాది ముందే ఇలాంటి మాటలతో ఆంధ్రా లో రాజకీయాలు వేడి ఎక్కాయి. మరి ఎన్నికల సమయానికి పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.