Jagan Fires On AP Govt. Over Paddy Procurement | ధాన్యం కొనే వారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, రోడ్లపైనే ధాన్యం..కొనేవారేరి ? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ).
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని నిలదీశారు.
ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని, మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నట్లు పేర్కొన్నారు. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గారు రైతులను రోడ్డున పడేశావ్, పంటలకు మద్దతు ధర ఏది అంటూ జగన్ ఘాటుగా ప్రశ్నించారు.