Sunday 8th September 2024
12:07:03 PM
Home > బిజినెస్ > జూన్‌దాకా వడ్డీరేట్లు తగ్గవు!

జూన్‌దాకా వడ్డీరేట్లు తగ్గవు!

Interest rates will not decrease until June!

-రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యసమీక్షపై డ్యూయిష్‌ బ్యాంక్‌

వచ్చే ఏడాది జూన్‌ వరకు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని, అవి యథాతథంగానే ఉంటాయని విదేశీ బ్రోకరేజీ దిగ్గజం డ్యూయిష్‌ బ్యాంక్‌ తాజగా అభిప్రాయపడింది. బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మొదలైన నేపథ్యంలో ఈసారి కూడా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపోరేటు జోలికి వెళ్లకపోవచ్చనే డ్యూయిష్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. మూడు రోజులు సాగే ఈ ద్రవ్యసమీక్షలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ ప్రకటించనున్నారు.
‘ఇప్పటికే రెపోరేటు గరిష్ఠ స్థాయిలో ఉన్నది. ఇంకా దీన్ని ఆర్బీఐ పెంచకపోవచ్చు. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడప్పుడే రెపోను తగ్గించకపోవచ్చు. దీంతో ఇప్పటికైతే కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంటాయని చెప్పవచ్చు’ అని తమ తాజా రిపోర్టులో డ్యూయిష్‌ బ్యాంక్‌ పేర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారిగా రెపోరేటును ఆర్బీఐ పెంచింది. మళ్లీ అప్పట్నుంచి జరిగిన ద్రవ్యసమీక్షల్లో దాని జోలికి సెంట్రల్‌ బ్యాంక్‌ వెళ్లనేలేదు. దీంతో ప్రస్తుతం రెపోరేటు 6.5 శాతం వద్ద ఉన్నది. ఈసారి కూడా అక్కడే ఉంటే.. వరుసగా ఐదో ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లు యథాతథంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

7 ట్రిలియన్‌ డాలర్లకు..
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని ఈ సందర్భంగా డ్యూయిష్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. తలసరి ఆదాయం కూడా 4,500 డాలర్లను తాకవచ్చని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్‌, జర్మనీలను అధిగమించి భారత్‌ నిలబడగలదన్న విశ్వాసాన్ని కనబర్చింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ 6.3 శాతంగా ఉండొచ్చని, ఆపై ఆర్థిక సంవత్సరం (2025-26) 6.2 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. కఠిన ద్రవ్య విధానమే ఇందుకు కారణమన్నది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 6.8 శాతంగా ఉండే వీలుందని చెప్పింది.

2024 ద్వితీయార్ధంలో 75 బేసిస్‌ పాయింట్లు తగ్గొచ్చు
వచ్చే ఏడాది జూన్‌ నుంచి వడ్డీరేట్ల కోతకు ఆర్బీఐ దిగే వీలుందని అంచనా వేస్తున్న డ్యూయిష్‌ బ్యాంక్‌.. 2024 మొత్తంగా రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు (ముప్పావు శాతం) తగ్గడానికి అవకాశాలున్నాయని చెప్తున్నది. అలాగే 2025లో మరో పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గడానికి ఆస్కారమున్నట్టు పేర్కొంటున్నది. నిజానికి వచ్చే ఏడాదే ఒక శాతం మేర తగ్గవచ్చని ఇంతకుముందు అంచనాలో డ్యూయిష్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు 2024 జూన్‌ నుంచి తగ్గడం మొదలయ్యే వీలుండటంతో ఈసారి తమ అంచనాను సవరించింది. మొత్తానికి వచ్చే ఏడాది మార్చికల్లా రెపోరేటు 5.50 శాతానికి దిగొస్తుందన్న ఆశాభావాన్ని డ్యూయిష్‌ బ్యాంక్‌ వ్యక్తం చేస్తున్నది. అయినప్పటికీ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతలు అనుకున్న రీతిలో లేకపోతే.. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపూ ఆలస్యం కావచ్చన్న సంకేతాలనిచ్చింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions