Hydra Commissioner Visits Bathukamma Kunta | హైదరాబాద్ నగరంలోని చెరువులు కుంటల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా హైడ్రా నగరంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చి వేస్తోంది.
ఈ క్రమంలో బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చే పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కమిషనర్ రాకతో స్థానిక వీకర్ సెక్షన్ కాలనీ వాసులు రంగనాథ్ ను కలిశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట చెరువుతో వరద ముప్పు తప్పి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుందని వారికి వివరించారు.
వారిని నమ్మొద్దు..
ఎవరైనా హైడ్రా పేరు చెప్పి మోసాలకు పాల్పడితే నమ్మవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంట వాసులకు సూచించారు. బతుకమ్మ కుంట చెరువును ఉన్న 5.15 ఎకరాల్లోనే చెరువును పునరుద్ధరిస్తామని తెలిపారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట పునరుద్దరణకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.
సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉండాలి. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని సర్వే అధికారులు తేల్చారు. అయితే తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది.
ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టబోతోంది. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆదేశాలు జారీ చేశారు.
ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు వివరించారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందని తెలిపారు.
మళ్లీ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకురావాలన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ తెలిపారు.