Intersting Facts About Dhoni | భారత క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ కూల్ (Captain Cool) గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) పుట్టినరోజు నేడు. 1981 జూలై 7న జన్మించారు ధోని. ఈ సందర్భంగా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ధోని క్రికెటర్ గా మారకముందు తన స్కూల్ డేస్ లో ఫుట్ బాల్ ఆడేవారట. అందులో ధోని గోల్ కీపర్ కూడా. గోల్ కీపింగ్ లో ధోని ప్రతిభను గుర్తించిన ఆయన కోచ్ వికెట్ కీపింగ్ వైపు దృష్టి సారించమని ప్రోత్సహించాడు. ఆ నిర్ణయమే భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన ఆటగాడిని తయారు చేసింది.
తన దేశ జట్టకు మూడు ఐసిసి ట్రోఫీలను (టి 20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ) అందించిన ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2009లో ధోని కెప్టెన్సీలోనే భారత క్రికెట్ జట్టు తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్.1 గా నిలిచింది.
క్రికెట్ లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన వికెట్ కీపర్ ధోని మాత్రమే. వన్డే, టీ20, టెస్ట్ మూడు ఫార్మాట్లతో కలిపి ధోనీ మొత్తం 195 స్టంప్ అవుట్లు చేశాడు. ధోనీ తర్వాత కుమార సంగక్కర 139 స్టంప్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్. 2011లో 106వ బెటాలియన్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.
క్రికెట్ తో పాటు ధోనికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర వింటేజ్ మోడల్స్ నుంచి లేటెస్ట్ వరకు చాలా బైకులు ఉన్నాయి. ఏకంగా ఆయన బైకులతో రాంచీలో ఒక పర్సనల్ గ్యారేజ్, మినీ మ్యూజియం కూడా ఉంది.
ధోనీ కెరీర్ స్టార్టింగ్ లో ఒక జులపాల జుట్టుతో స్పెషల్ హెయిర్ స్టైల్ మెయింటెన్ చేశాడు. ఆ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండేవారు. ఏకంగా అప్పటి పాకిస్తాన్ ప్రెసిండెంట్ కూడా ధోని హెయిర్ స్టైల్ కు ఫిదా అయ్యాడు.
లాహోర్ జరిగిన ఇండియా పాక్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ టైంలో పాక్ ప్రెసిడెంట్ ముషారఫ్ మాట్లాడుతూ ధోనీ ఈ హెయిర్ స్టైల్ లో చాలా బాగున్నావ్. జుట్టు కత్తిరించుకోవద్దు అని సూచించారు.
ధోని జెర్సీ 7 ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా!
భారత్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన జెర్సీ నంబర్ 7 ని ఎంపిక చేసుకోవడానికి కారణమేంటో తెలుసా. దీనికి వెనక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ధోని తల్లిదండ్రులు 7వ తేదీనే బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారట. యాదృచ్ఛికంగా 7వ నెల 7 వ తేదీన ధోని జన్మించారు. ఆయన పుట్టిన సంవత్సరం 1981. చివరి రెండకల్లో 8 నుంచి 1 తీసేస్తే 7.
అలా 7 అంకెతో ధోనికి విడదీయలేని అనుబంధం ఉండటంతో ఆయన తన జెర్సీ నెంబర్ 7 గా ఎంచుకున్నట్లు ఓ సందర్భంలో తెలిపారు.
భారత క్రికెట్ కు ధోని అందించిన సేవలకు గుర్తుగా ఆయన రిటైర్ అయిన వెంటనే బీసీసీఐ కూడా జెర్సీ నెం. 7 కు రిటైర్మెంట్ ప్రకటించింది.
సచిన్ జెర్సీ నెం 10 రిటైర్మెంట్ తర్వాత ఈ గౌరవం అందుకున్నది ధోని మాత్రమే. ఈ రెండు నంబర్ల జెర్సీలను ఇక ఏ భారత్ క్రికెటర్లు ఎంచుకోవడానికి వీలు లేదు.







