Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > అందాల పోటీలకు నిధులు ఉన్నాయి.. ఉద్యోగులకు లేవా?: హరీశ్ రావు!  

అందాల పోటీలకు నిధులు ఉన్నాయి.. ఉద్యోగులకు లేవా?: హరీశ్ రావు!  

Harish Rao Speech Today | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారని మండిపడుతూ, ఉద్యోగుల పెండింగ్ ప్రయోజనాలపై స్పష్టమైన గడువు చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 5 డీఏలు (DA) పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం సూటిగా చెప్పాలని కోరారు.

“అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కొత్త పీఆర్సీ (PRC) ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండేళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. మార్చి 31తో గడువు ముగుస్తోంది, మళ్ళీ పొడిగిస్తారా లేక రిపోర్ట్ తీసుకుని అమలు చేస్తారా?” అని ప్రశ్నించారు.

30 ఏళ్లకు పైగా సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం సెక్రటేరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో వైద్యం, పిల్లల పెళ్లిళ్ల కోసం వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

“ఫ్యూచర్ సిటీకి, మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఉన్నాయి.. అందాల పోటీలకు, ఫుట్ బాల్ షోలకు నిధులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల క్యాంప్ ఆఫీసులకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

కానీ, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలకు మాత్రం నిధులు లేవనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి (IR) ప్రకటించి ఆదుకోవాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions