Harish Rao On TG Budget | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని, సామాన్య ప్రజలను ఇది తీవ్రంగా నిరాశపరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు.
అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం ‘ఘోరీ’ కట్టిందని ధ్వజమెత్తారు.
“గత బడ్జెట్ కంటే పేజీలు పెరిగాయి, అంకెలు పెరిగాయి తప్ప.. ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఆరు గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
గతేడాది ₹56 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి ఆ మొత్తాన్ని ₹50 వేలకు తగ్గించడం దారుణం” అని ఆయన మండిపడ్డారు.
రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ₹2500 ఆర్థిక సాయం వంటి హామీల ఊసే లేదని హరీశ్ రావు విమర్శించారు.
“సన్నవడ్లకు రెండు పంటలకూ బోనస్ ఇచ్చామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. ఇది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. లేకపోతే ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని సవాల్ విసిరారు.
మూడేళ్లు నిండకముందే ప్రభుత్వం ₹3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్ర అప్పుల భారం జీఎస్డీపీలో 28 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ గారు అప్పులు తెచ్చి కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు నిర్మిస్తే.. ఈ ప్రభుత్వం ఆ సంపదను బూడిద చేస్తోందని ఆరోపించారు.
సింగరేణిలో బోగస్ ప్రొడక్షన్, ఇరిగేషన్ మరియు ఐటీ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందని హరీశ్ రావు విమర్శించారు.
“ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాల భూమి ఎక్కడుందో చెప్పాలి. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తున్నది కేవలం అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికే” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ గారు ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ పథకం, యాదాద్రి ప్లాంట్, టిమ్స్ ఆసుపత్రుల వంటి వాటిని ఇప్పుడు తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో వసతులు లేక విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇది అభయహస్తం కాదు.. ప్రజలకు చూపించిన రిక్త హస్తం. సకల జనులకు దక్కింది గుండు సున్నా!” అని సెటైర్లు వేశారు








