కొత్తగా ఏర్పడ్డ రెండు కార్పొరేషన్లు ఇవే!
GHMC as 3 Corporations | తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Cyberabad Municipal Corporation) (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (Malkajgiri Municipal Corporation) (MMC) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్ఎంసీ కి ప్రస్తుత కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కొనసాగించింది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan)ను ఈ మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా నియమించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్‌లు ఉంటాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌ల పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి.









