Ex MLA Digital Arrest | ఇటీవల కాలంలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులుగా డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల నుంచి సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఈ డిజిటల్ అరెస్ట్ స్కాంలో చిక్కుకొని రూ. 31 లక్షలు పోగొట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే బిదర్ జిల్లా ఔరాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్‌కి ఆగస్ట్ 12న ఓ వ్యక్తి కాల్ చేసి తనను సీబీఐ అధికారి అని పరిచయం చేసుకున్నారు.
నరేశ్ గోయల్ ఇంటిపై జరిగిన దాడిలో వకీల్ పేరిట అకౌంట్లు బయటపడ్డాయని తెలిపాడు. తర్వాత ఆయనను మరో నకిలీ అధికారి ‘నీరజ్ కుమార్’కు కలిపి, డిజిటల్ అరెస్టు పేరుతో వాట్సాప్ వీడియో కాల్‌లో నిఘాలో ఉంచారు.
ఆగస్ట్ 13న వర్చువల్ కోర్టులో నకిలీ న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. కోర్టు డ్రామాలో భాగంగా రూ.10.99 లక్షలు, ఆగస్ట్ 18న మరో రూ.20 లక్షలు మొత్తం రూ.31 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించారు.
రోజూ విచారణలు, కుటుంబ వివరాల్ని తీసుకుంటుండటంతో మానసిక ఒత్తిడితో వకీల్ డబ్బులు పంపించారు.
చివరికి కుటుంబ సభ్యులు మోసాన్ని గుర్తించిన తర్వాత బాధితుడు వకీల్ సెప్టెంబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నకిలీ ఐడీ కార్డులు, అరెస్ట్ వారంట్లు చూపుతూ మోసం చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.









