Maharashtra New CM | మహారాష్ట్ర (Maharashtra)లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని మహాయుతి (Mahayuthi) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఫలితాల తర్వాత మహారాష్ట్ర తదుపరి సీఎం (Maharashtra CM) ఎవరనే విషయంలో కొనసాగిన ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ఈసారి కూటమిలో సీఎం పదవి బీజేపీనే వరించింది.
ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మరోసారి మహా సీఎంగా ఎంపికయ్యారు. బుధవారం జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబరు 5న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబయిలోని విధాన్ భవన్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. సీఎం ఎంపికపై పార్టీ కోర్ కమిటీ ఎమ్మెల్యేలతో చర్చించారు.
అనంతరం భాజపా శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.
సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajith Pawar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నట్లు సమాచారం..