Deputy Cm Pawan Kalyan On Language Row | జనసేన జయకేతనం సభలో హిందీ భాషపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
అయితే పవన్ వ్యాఖ్యల పట్ల తమిళనాడులో అధికార డీఎంకే నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో హిందీ గో బ్యాక్ అని నినదించిన పవన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం, రెండూ భారతదేశ జాతీయ మరియు సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు వివరణ ఇచ్చారు.
NEP 2020 హిందీని తప్పనిసరి చేయలేదని , హిందీని విధించడం గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. NEP 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు మాతృభాష మరియు మరేదైనా భారతీయ భాషను నేర్చుకునే వెసులుబాటును కల్పించిందన్నారు.
హిందీ బదులు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ వంటి ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని తెలిపారు. బహుళ భాషా విధానం జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి మరియు దేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడిందని పోస్ట్ చేశారు.
ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవడం మరియు పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం అవగాహన రాహిత్యమే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జనసేన పార్టీ ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ మరియు విద్యా ఎంపిక సూత్రానికి దృఢంగా కట్టుబడి ఉందని వెల్లడించారు.