Delhi Car Blast | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారులో అత్యంత తీవ్రతతో ఓ భారీ పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీలోని ఎర్ర కోట, చాందినీ చౌక్ మధ్యనున్న రోడ్డు మీద సరిగ్గా సిగ్నల్ జంక్షన్ లో నవంబర్ 10, సోమవారం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు HR 26 CE 7674 నంబర్ గల హ్యుండాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇప్పటివరకు 12 మంది మృతిచెందారు.
బ్లాస్ట్ జరిగిన సమయంలో తొమ్మిది మంది, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరగడానికంటే ముందు ఈ కారు ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలో సుమారు మూడు గంటలు పార్క్ చేసి ఉంది. సాయంత్రం 3.19 గంటల నుంచి, 6 గంటల 48 నిమిషాల వరకు పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు ఆ తర్వాత బయటకు వచ్చి నిదానంగా కదులుతూ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలింది. ఆ వెంటనే సమీపంలోని డజనుకు పైగా వాహనాలకు మంటలు అందుకున్నాయి. ఇది ఫిదాయిన్ శైలిలో జరిగిన ఉగ్రదాడి అనే అనుమానం వ్యక్తం అవుతోంది.









