Cases On Food Adulterations | “ఆహార కల్తీ అనేది కేవలం ఒక నేరం కాదు.. అది సమాజంపై జరుగుతున్న ఘోరమైన దాడి” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టి లాభాలు ఆర్జిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు హైదరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన H-FAST (Hyderabad Food Adulteration Safety Team) బృందం రికార్డు స్థాయిలో ఫలితాలు సాధిస్తోందని ఆయన వెల్లడించారు.
గత 30 రోజుల్లో కల్తీ ముఠాల గుట్టు రట్టు చేస్తూ సిపి సజ్జనార్ గారు వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ఒక్క నెలలోనే 61 కేసులు నమోదు అవగా, 64 మందిని అరెస్ట్ చేశారు. 15 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు.
వంటింట్లో ప్రతి వస్తువూ విషతుల్యమే..
మనం నిత్యం వాడే వస్తువుల్లో కల్తీ జరుగుతున్న తీరుపై సిపి ఆందోళన వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ లు, ప్రతి ఇంట్లో నిత్యం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి. ఆరోగ్యానికి అవసరమైన పాలు, పెరుగు వంటి పదార్థాల్లోనూ విషం నింపుతున్నారని మండిపడ్డారు.
ప్రజారోగ్యమే పరమావధిగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను (హైడ్రా, ఈగల్ తరహాలో) ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సజ్జనార్ స్వాగతించారు.
సీఎం ఆలోచనలకు అనుగుణంగానే H-FAST బృందం నిరంతరం దాడులు చేస్తూ ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. “ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కల్తీ లేని సమాజం కోసం మా పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని సజ్జనార్ స్పష్టం చేశారు.









