Complaint Filed Against KCR | తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువైన తొలి రోజే మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. కేసీఆర్ పై గురువారం ఫిర్యాదు నమోదు అయ్యింది.
అది కూడా కేసీఆర్ మానసపుత్రికగా భావించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని.. దానిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏసీబీకి హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని, నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని ఫిర్యాదుదారు ఆరోపించారు.
మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు ఉమ్మడి ఏపీలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ప్రస్తావించారు.
అయితే పనులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత కలిసి ప్రాజెక్టు అలైన్‌మెంట్లు, డిజైన్లు మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిని, అంచనాలను పెంచారని భాస్కర్ ఆరోపించారు.
తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏసీబీకి విజ్ఞప్తి చేశారు.