CM Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivaraj Singh Chouhan) మూత్రవిసర్జన బాధితుడి కాళ్ళు కడిగి అతనికి క్షమాపణలు చెప్పారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధి ప్రాంతంలో ప్రవేశ్ శుక్ల అనే వ్యక్తి ఓ ఆదివాసిపై మూత్రవిసర్జన చేసిన వీడియో దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని లేపింది.
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ఈ అసాంఘిక చర్యను ఖండించారు. అలాగే ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘటనపై వెంటనే స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధితుణ్ని భోపాల్ లోని తన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆహ్వానించారు.
తర్వాత ఆ ఆదివాసీ కాళ్లు కడిగి క్షమాపణ కోరారు. శాలువాతో సన్మానించి వినాయకుడి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు.
అనంతరం బాధితుడితో కలిసి సీఎం మొక్కల్ని నాటారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి ఆదివాసి భార్యను క్షమాపణలు కోరారు.
కొద్దిసేపు బాధితుడితో మాట్లాడిన సీఎం యోగక్షేమాలు తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు లభిస్తున్నాయా అని ఆరాతీయగా బాధితుడు లభిస్తున్నాయని సమాధానం ఇచ్చారు.
ఈ వీడియోను శివరాజ్ సింగ్ చౌహన్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు.
”మనస్సు విచారంగా ఉంది. దశమత్ జీ, ఇది మీ బాధను పంచుకునే ప్రయత్నం. నేను కూడా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను.
నాకు ప్రజలే దేవుళ్లు! ఎవరితోనైనా దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం నా గౌరవం” అని ట్విట్టర్ వేదికగా సీఎం స్పందించారు.
మూత్రవిసర్జన బాధితుడు అయిన గిరిజన వ్యక్తి దశమత్ రావత్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. ఆరున్నర లక్షల (6.5Lakhs) ఆర్ధిక సహాయాన్ని శుక్రవారం ప్రకటించింది.0
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రేస్ పార్టీ బీజేపీ మరియు సీఎం పైన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ దారుణానికి పాల్పడిన ప్రవేష్ శుక్ల బీజేపీకి చెందిన వ్యక్తి , సిద్ధి ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్ల అనుచరుడు అని వారు ఆరోపించారు.
అలాగే ప్రవేశ్ శుక్ల బీజేపీ నాయకులతో కలిసిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీనిపై స్పందించిన సీఎం నేరస్థుడికి కులం, మతం లేదా పార్టీ ఉండదు. అతనిపై కఠినంగా వ్యవహరిస్తాం అని పేర్కొన్నారు.
ప్రవేశ్ శుక్లను బుధవారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న తన ఇంటిని ప్రభుత్వం ధ్వంసం చేసింది.