CM Revanth Reddy News | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృశ్యం అయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫాక్ట్ చెక్ విభాగం స్పందించింది. దావోస్ నుండి అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి అదృశ్యం అయ్యారని, షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే దావోస్ నుండి జనవరి 22న ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా న్యూయార్క్ వెళ్లిపోవడమే కాకుండా, ఎయిర్పోర్ట్‌కు ఎవరూ రాకుండా సీఎం జాగ్రత్తలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఫాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ..ముఖ్యమంత్రి అధికారిక విదేశీ పర్యటనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, కల్పితం అని పేర్కొంది.
ముఖ్యమంత్రి అదృశ్యమయ్యారని లేదా అనధికారికంగా ప్రైవేట్ ట్రిప్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి, వాస్తవాలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి ప్రయత్నం జరుగుతుందని వెల్లడించింది. ముఖ్యమంత్రి న్యూయార్క్ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు వివరించింది. దావోస్ నుంచి సీఎం అమెరికా చేరుకున్న తర్వాత కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఆయనకు స్వాగతం పలికినట్లు తెలిపింది.









