Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం: సీఎం  

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం: సీఎం  

cm revanth speech

CM Revanth Speech Today | శాసనమండలి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ నగరాభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ మరియు మూసీ ప్రక్షాళనపై కీలక ప్రసంగం చేశారు.

దేశంలోని ఇతర మహానగరాలైన ఢిల్లీ (కాలుష్యం), ముంబై (వరదలు), బెంగళూరు (ట్రాఫిక్) ఎదుర్కొంటున్న సమస్యలు హైదరాబాద్‌కు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే కఠినమైన సంస్కరణలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించినట్లు సీఎం తెలిపారు.

మెట్రో విస్తరణపై ఎల్ అండ్ టీతో చర్చించి, రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోను స్వాధీనం చేసుకునే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు.

“మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లోపించింది. అందుకే కేంద్ర సహకారంతో మెట్రోను విస్తరిస్తున్నాం. బేగంపేట ఎయిర్ పోర్టు రన్ వే కింద అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తెచ్చాం. దేశంలో రన్ వే కింద రోడ్డు ఉండటం ఇదే తొలిసారి” అని ఆయన పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళనపై స్పష్టత.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. “మీకు ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి నివేదించండి” అని సూచించారు.

మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తరపున ఆయన ఒక బలమైన హామీ ఇచ్చారు. “మేం ఎవరినీ నిరాశ్రయులను చేయం. ప్రతి ఒక్కరికీ మెరుగైన పునరావాసం కల్పిస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి అభివృద్ధిని అడ్డుకోవద్దు” అని విజ్ఞప్తి చేశారు.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట 40 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నామని, దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని సీఎం వివరించారు. స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా హైదరాబాద్‌ను నివాస యోగ్యంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions