KCR Strategic Politics | కాపు సామాజిక వర్గం అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh).
తెలంగాణ లో కాపులు ఉన్నప్పటికీ ఆంధ్రాలో వీరి జనాభా అధికంగా ఉండటం, ఆంధ్ర లోని రాజకీయాలను కులాలు అత్యధికంగా ప్రభావితం చెయ్యడం జగమెరిగిన సత్యం.
ఆ కాపు సామాజికవర్గమే టార్గెట్ గా ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు టీఎస్ సీఎం కేసీఆర్ (CM KCR). కాపులని టార్గెట్ చెయ్యడం ద్వారా తెలంగాణలో సాధించేది ఏముంటది అనే అనుమానం కలగకగా మానదు.
కానీ కేసీఆర్ ఇక్కడ తెలంగాణ కంటే ఆంధ్ర రాజకీయాల్లో ప్రయోజనాల కోసమే కాపుల పైన దృష్టి పెడుతున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి.
టీఆరెస్ (TRS) జాతీయ రాజకీయాల్లోకి ఎంటరై బీఆరెస్ (BRS)గా అవతరించిన తర్వాత తన పార్టీని దేశవ్యాప్తంగా ప్రభావం చూపేలా మారుస్తానని కేసీఆర్ ఏనాడో ప్రకటించారు.
అందులో భాగంగానే మహారాష్ట్ర (Maharashtra)లో తరచుగా పర్యటిస్తున్నారు. అలాగే ఆంధ్ర లో కూడా బీఆరెస్ పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు.
మాజీ సివిల్ సర్వెంట్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆరెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు. అలాగే ఆంధ్ర నుండి వివిధ పార్టీ లకు చెందిన నాయకులు బీఆరెస్ లో చేరారు.
కానీ కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల పైన పెద్దగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు అక్కడ పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా కేవలం ఆంధ్ర కాపులు మాత్రమే కాకుండా తెలంగాణ లో ఉన్న మున్నూరు కాపులు, హైద్రాబాద్ నగరం లో ఉన్న ఆంధ్ర కాపులు, బలిజ, తెలగా, ఒంటరి సామాజిక వర్గాల పై కూడా దృష్టి సారించినట్టు సమాచారం.
కాపు ప్రముఖులతో కేసీఆర్ భేటీ..
నిన్న ప్రగతి భవన్ లో ఆంధ్రా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురి తో కేసీఆర్ గంటల తరబడి చర్చించినట్టు సమాచారం. ఇందులో అధికంగా మాజీ ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఉన్నట్టు సమాచారం.
ఏపీ బీఆరెస్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, మాజీ ఐపిఎస్ లక్ష్మీకాంతం, మాజీ ప్రభుత్వ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి రంగబాబు, కొందరు వ్యాపారవేత్తలు ఉన్నట్టు సమాచారం.
కానీ వీరిలో అధికంగా ఆంధ్రా కి చెందిన వారే ఉండటం ద్వారా కేసీఆర్ ఆంధ్రాలో రాబోయే ఎన్నికల కోసం వ్యూహలు రచిస్తున్నట్టున్నారు.
భేటీకి కారణమిదీ..
కేసీఆర్ ఉన్నట్టుండి ఇలా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులని హఠాత్తుగా కలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భేటీ కి కూడా కారణం లేకపోలేదు. శనివారం రోజున హైద్రాబాద్ లో “కాపు ఐకానిక్ గ్రూప్” పేరుతో ఒక సమావేశం జరిగింది.
దీనికి మేఘాలయ మాజీ సీఎస్ కెఎం కుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఈ భేటీ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన కాపులు వారి కుటుంబాలతో హాజరయ్యారు.
తెలంగాణ లోని మున్నూర్ కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం బీజేపీ ఆధ్వర్యంలోనే ఈ భేటీ జరిగిందని కేసీఆర్ తన ఇంటలిజెన్స్ సహకారంతో తెలుసుకున్నారు. దీనితో హుటాహుటిగా కేసీఆర్ కాపు వర్గానికి చెందిన పలువురు మాజీ అధికారులతో సమావేశం అయ్యారు.
ఏం చర్చించారు..
కాపు నేతలతో భేటీ అయిన కేసీఆర్ ముందు కొద్దిసేపు తెలంగాణ లోని కాపు, మున్నూర్ కాపు సామాజిక వర్గం గురుంచి చర్చించారు. కానీ అధిక సమయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్టు సమాచారం.
కేసీఆర్ తో చర్చలో భాగంగా ఈ నాయకులు తెలంగాణ లోని వివిధ కాపు వర్గానికి 5 ఎకరాల భూమి, రూ. 10 కోట్ల నిధులు అడిగారు. దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి వారి కోరికను తీరుస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాపుల్లో అసమ్మతి మరియు అధికార కాంక్ష..
ఆంధ్రా లో కాపులు జనాభా పరంగ కమ్మ, రెడ్డిలకంటే ఎక్కువ. జనాభా పరంగా ఎక్కువ ఉన్న ఆ సామాజిక వర్గానికి అధికారం లేదని ఎప్పటి నుంచో వారిలో అసంతృప్తి ఉంది.
మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వివిధ హోదాలో కాపు నాయకులు ఉన్న సీఎం కుర్చీ లో మాత్రం కావు నాయకుడు లేకపోవడం ఈ అసంతృప్తికి కారణం.
మంత్రులుగా, ఎమ్మెల్యేలు గా ఉన్న అధికారం మొత్తం సీఎం చేతిలో ఉంటుంది. కానీ సీఎం కుర్చీలో కమ్మ, రెడ్డి లు మాత్రమే కూర్చోవడం వారి వర్గానికి చెందిన వారు సీఎం అవ్వలేక పోవడం వారిలోని అసహనాన్ని తెలియజేస్తుంది.
చిరంజీవి రూపంలో వారికి ఒక ఆశ కనిపించిన అది ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు కాపు సమాజం ముఖ్యాoగా యూత్ పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు.
ఇది ఇలా ఉండగా 2014 ఎన్నికల్లో కాపులు అధికంగా టీడీపీ వైపు ఉన్నారు. దానికి కారణం రాష్ట్ర విభజన, పవన్ కళ్యాణ్ బేషరతుగా టీడీపి బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం. కానీ 2019 ఎన్నికల్లో కాపు ఓటు వైసీపీ వైపు మళ్లింది.
పవన్ కళ్యాణ్ పైన నమ్మకం లేకపోవడం, టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు కాపులను పెద్దగా పట్టించుకోలేదని వారు వైసీపీ వైపు ఓట్లు వేశారు.
అది స్పష్టంగా ఫలితాలలో కనిపించింది. కాపులు అధికంగా ఉండే చోట్ల వైసీపీ అధిక సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2024 లో కాపు ఓటు ఎవరి వైపు వస్తుంది అని అందరిలోనూ ఆసక్తి రేపుతుంది.
2019 ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ బలంగా ప్రజల్లో తిరగడం, వచ్చే ఎన్నికల్లో తన పార్టీని గెలిపించడానికి ముందుగానే ప్రచారo మొదలుపెట్టి వైసీపీ పై విరుచుకుపడుతున్నాడు. అలాగే తరచుగా మాట్లాడుతూ బహిరంగంగా కాపులు తనకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
అలాగే జనసేన టీడీపీ పొత్తు పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. పొత్తు దాదాపు ఖరారు అయినట్లే అని కొందరు అంటున్నారు. ఇదే గనుక జరిగితే వైసిపి కి పెద్ద దెబ్బ తగులుతుంది అని చెప్పాలి.
వైసీపీకి లాభం చేకూర్చేవే..
ఇలాంటి సమీకరణాలు ఆంధ్ర లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ కాపు పైన దృష్టి సారించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరి కేసీఆర్ నిజంగానే తన పార్టీ ని బలపరచడానికి ఇది చేస్తున్నారా లేదా వైసిపి కి మద్దతుగా కాపు ఓటు చీల్చి వైసీపీ గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారా?? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
దీనికి కారణం 2019 లో వైసీపీ గెలుపు కోసo కేసీఆర్ సహకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఆంధ్రాలో కేసీఆర్ రాజకీయాలు వ్యూహాలు ఎటొచ్చి వైసీసీకి లాభం చేకూర్చేవే!










