Chiranjeevi Fan Cycle Ride | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయణ్ని ఒక్కసారి కలిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ కోకోల్లలు.
ఈ క్రమంలోనే తన ఆరాధ్య నటుడు చిరంజీవిని కలిసేందుకు ఓ మహిళా అభిమాని ఓ సాహసానికి పూనుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని ఆదోనికి చెందిన చిరంజీవి అభిమాని రాజేశ్వరి ఆయణ్ని కలవడానికి ఆదోని నుంచి హైదరాబాద్ కు సైకిల్ పై బయలుదేరింది.
ఎన్నో సవాళ్ల మధ్య మొత్తానికి హైదరాబాద్ కు చేరి తన అభిమాన నటుణ్ని కలిసే అవకాశం దక్కించుకుంది. రాజేశ్వరి ప్రయాణం గురించి తెలిసిన చిరంజీవి తన ఇంటికి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి చిరంజీవి చలించిపోయారు.
ఈ సందర్భంగా చిరంజీవికి రాజేశ్వరి రాఖీ కట్టారు. అనంతరం చిరంజీవి ఆమెకు ఆశీస్సులు అందించి చీరను బహుమతిగా అందజేశారు.
రాజేశ్వరి పిల్లల విద్య కోసం తగిన ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ వీడియోను మెగాఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.






