చలికాలంలో వేడివేడిగా ఇష్టమైన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు పండగ సీజన్ కావడంతో పలు వంటకాలను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజన్‌లో కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. అధికంగా షుగర్, ఆల్కహాల్ వినియోగం కూడా ఈ సమస్యలను మరింత జటిలం చేస్తుంది. అనారోగ్యకర ఆహారం అధికంగా తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గడం పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నట్స్, బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం ప్రేవుల్లో ఆరోగ్యకర బ్యాక్టీరియా పెరిగేందుకు దారితీస్తుంది.
ఈ ఆహారపదార్ధాలతో పాటు తగినంత నీరు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చని ప్రేవుల కదలిక మెరగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడేందుకు పెరుగు, మజ్జిగ వంటి పులిసిన ఆహార పదార్ధాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇంకా భోజనాన్ని బాగా నమిలిమింగడాన్ని కూడా అలవరుచుకోవాలి. వీటితో పాటు మితాహారం తీసుకుంటూ తగినంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.