KTR Comments | తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తన నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నేతలను కలిశారు.
సిరిసిల్ల బీఆరెస్ కార్యాలయంలో డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం.. నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి, పోరాటాలు తమకేం కొత్త కాదని పేర్కొన్నారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం సహజమని అభిప్రాయపడ్డారు.
ప్రజలు తమకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారనీ, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర లో కూడా రాణిస్తామన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఓడిపోయినందుకు కాంగ్రెస్ కి ఓటేసినవారే బాధపడుతున్నారని తెలిపారు.
తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ అనీ, ఆ రెండింటిని ప్రజలు వదులుకోరని స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతాం అని చెప్పారు.