- కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ అభివృద్ధి లేదు
- కేసీఆర్ పోరాడకపోతే తెలంగాణ వచ్చేదా?
- తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది
- తెలంగాణ భవన్లో దీక్షా విజయ్ దివస్ వేడుకలు
- కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుతున్న బీఆర్ఎస్ నేతలు
Diksha Vijay Divas Celebrations | తెలంగాణ భవన్లో దీక్షా విజయ్ దివస్ (Diksha Vijay Divas) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ దీక్షా విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ త్యాగాల వల్లే తెలంగాణ సాధ్యమైందని గుర్తుచేశారు.
నవంబర్ 29 దీక్ష లేకపోతే డిసెంబర్ 9, జూన్ 2లూ ఉండేవికాదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, ఆయన సమైక్యవాదుల బాటలో నడుస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
అమెరికాలో భారతీయులను ఇబ్బంది పెట్టిన ట్రంప్ పేరును రోడ్డుకు పెట్టడం అవమానకరమని తెలిపారు. కేసీఆర్ పోరాటమే తెలంగాణకు ఆధారం అని, ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా అవుతారని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ నేత జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష తర్వాతే కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారని కొనియాడారు.
కానీ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన వికాసం కాదని, విద్వంసమని ప్రజలు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను మళ్లీ అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ భూగోళంపై తెలంగాణ ఉన్నదంటే ఒక్క కారణం కేసీఆర్ మాత్రమే. ఉద్యమంలో పాల్గొనని పీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్‌కు కేసీఆర్ దీక్ష గురించి ఎలా తెలుసు? అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా కేసీఆర్ తెలంగాణను సాధించారు. కేంద్రం డిసెంబర్ 9 ప్రకటన చేసినప్పటికీ కొద్దిరోజుల్లోనే వెనక్కు తీసుకుంది. ఆ రోజు విద్రోహ దినంగా పాటించాలి” అని పేర్కొన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, “కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడకపోతే ఇంకా 200 సంవత్సరాలు అయినా తెలంగాణ వచ్చేది కాదు. గాంధీ దేశానికి ఎంత ముఖ్యమో, తెలంగాణకు కేసీఆర్ అంతే. హేళనను తిప్పికొట్టుకుంటూ ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. హరీష్ రావు లాంటి నాయకులు రేయింబవళ్లు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు తెలంగాణను ద్రోహులు పాలిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
మాజీ శాసన మండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది. సింహం తన చరిత్ర చెప్పకపోతే వేటగాడు రాసుకున్నదే చరిత్ర అవుతుంది. కేసీఆర్ పోరాడకపోతే తెలంగాణ వచ్చేదా? 1969లో ఎందుకు రాలేదు? తొలి ఉద్యమంలో యువకులు ప్రాణాలు అర్పించారు. కేసీఆర్ గాంధేయ పద్ధతుల్లో తెలంగాణ సాధించారు.
రాష్ట్రం ఏర్పడకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో, తర్వాత కేసీఆర్ ఏ మార్పు తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ అభివృద్ధి లేదు. కాంగ్రెస్ దుష్ప్రచారానికి ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు కొత్త తరానికి నిజమైన ఉద్యమ చరిత్రను చెప్పాలి” అని పేర్కొన్నారు.









