BJP MLA Suryanarayana | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక సంచలన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు.
రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం దేవుళ్ల పేర్లతో నడుస్తున్న మద్యం షాపుల పేర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కేటాయించే మద్యం దుకాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుళ్ల పేర్లు పెట్టకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి.
పవిత్రమైన దేవుళ్ల పేర్లను మద్యం విక్రయించే చోట వాడటం హిందూ మతాన్ని మరియు భక్తుల మనోభావాలను తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చే సమయంలోనే పేరు విషయంలో స్పష్టమైన నిబంధనలు విధించాలని ఎక్సైజ్ శాఖను కోరారు.
బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, ఆధ్యాత్మికతకు మారుపేరైన తెలంగాణలో ఇలాంటి ధోరణి సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి హిందూ సమాజానికి గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.






