AP Jitender Reddy Tweet | మహబూబ్ నగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు, బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి (AP Jitender Reddy) ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.
క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీ తెలంగాణ విషయం లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.
కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ పోరు, నాయకులు పార్టీని వీడుతారా అనే అనుమానాల మధ్య బీజేపీ సతమతమవుతోంది.
ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పెను దుమరాన్నే రేపుతోంది.
గురువారం జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి దున్నపోతులను ట్రాలీ లో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు.
ఒక దున్నపోతు మొరాయిస్తే ఆ వ్యక్తి దాన్ని తన్నుతూ ట్రాలీలో ఎక్కించే ప్రయత్నం చేస్తాడు.
ఇలాంటి ట్రీట్మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అవసరం అని ట్వీట్ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ వీడియోను బీజేపీ, అమిత్ షా, బిఎల్ సంతోష్ లకు ట్యాగ్ చేసి టీ బీజేపీ నాయకత్వంపై తనకు ఎంత అసంతృప్తి ఉందో చెప్పకనే చెప్పారు.
Read Also: ఎన్నికల ముందు ఆరోపణలు.. బీఆరెస్ లో అందరి చూపు ఆ ముగ్గురి వైపే!
ఇటీవలే ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పజెపితే మా పరిస్థితి ఏంటని, ఇతర లీడర్లతో కలిసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఇప్పుడు ఏకంగా టీ బీజేపీ నాయకత్వం పైన ఇలాంటి ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.
మరి జితేందర్ రెడ్డి పార్టీ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనేది బయటకు రావాల్సి ఉంది.
టి బీజేపీ నాయకత్వం అంటే బండి సంజయ్. మొన్నటి వరకు సఖ్యతగా మెలిగిన వీరిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఒక్క ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కిన జితేందర్ రెడ్డి అస్సలు పార్టీ లో ఉంటాడా లేక పార్టీ మారుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నానయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో ట్వీట్ తో డ్యామేజ్ కంట్రోల్ కు యత్నం..
జితేందర్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ను బీఆరెస్, కాంగ్రెస్ నాయకులు వైరల్ చేశారు. బీజేపీలో పరిస్థితి ఇదీ అంటూ సెటైర్లు వేశారు.
దీంతో ట్వీట్ తో జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు జితేందర్ రెడ్డి.
వెంటనే మరో ట్వీట్ చేస్తూ, బీఆరెస్ నాయకులపై మండిపడ్డారు. తన ట్వీట్ ను బీఆరెస్ వాళ్ళు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
“కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి.”
ఓవైపు ఇలా బీజేపీ నాయకత్వాన్ని తప్పుబడుతూ, మళ్లీ కాసేపటికే బీఆరెస్ వాళ్లపై విరుచుకుపడటం కాషాయ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
రెండు రకాలుగా జితేందర్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక మర్మం ఏమై ఉంటుందో అనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. మరి బీజేపీ నాయకత్వం ఈ ట్వీట్ పై ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.