Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > “బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నాం”

“బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నాం”

telangana budget

– ఉద్యోగుల బకాయిలపై భట్టి విక్రమార్క క్లారిటీ!

TG Deputy CM Speech Today | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఆర్థిక విధ్వంసం’ వల్లే ఉద్యోగులకు ఈ పరిస్థితి వచ్చిందని, తమ ప్రభుత్వం వచ్చాకే వ్యవస్థలు పట్టాలెక్కుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఒకటో తేదీనే జీతాలు – మూడు డీఏల చెల్లింపు:

“బీఆర్ఎస్ హయాంలో 15వ తేదీ వచ్చినా జీతాలు పడని పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 3 డీఏలను (DA) ఇప్పటికే క్లియర్ చేశాం. మిగిలిన 4 డీఏలపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం” అని భట్టి వెల్లడించారు.

రిటైర్మెంట్ వయసు పెంపుతో అదనపు భారం..

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకోవడానికే గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును 58 నుండి 61 ఏళ్లకు పెంచిందని ఆయన విమర్శించారు. దీనివల్ల ఇప్పుడు ఏకకాలంలో 17 వేల మంది పదవీ విరమణ చేయడంతో ఆ ఆర్థిక భారం (రిటైర్మెంట్ బెనిఫిట్స్) తమ ప్రభుత్వంపై పడిందని వివరించారు.

పెండింగ్ బిల్లుల క్లియరెన్స్..

ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ. 40,150 కోట్ల బకాయిలు ఉన్నాయని, అందులో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 4,575 కోట్లు ఉన్నాయని భట్టి తెలిపారు. ఇప్పటివరకు రూ. 6,146 కోట్లు క్లియర్ చేశామని, బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెలా కేటాయించే రూ. 700 కోట్లను రూ. 1,000 కోట్లకు పెంచే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు.

హెల్త్ కార్డులు మరియు ప్రమాద బీమా..

“పదేళ్లుగా ఉద్యోగ సంఘాలు అడిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నగదు రహిత వైద్య చికిత్స కార్డులను (Cashless Health Cards) అందుబాటులోకి తెస్తున్నాం. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ. 1.25 కోట్ల బీమా అమలు చేయబోతున్నాం” అని భట్టి పేర్కొన్నారు.

పీఆర్సీపై స్పష్టత..

పీఆర్సీ (PRC) నివేదిక రాగానే దానిపై సమగ్రంగా చర్చించి, కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. గతంలో ఉద్యోగ సంఘాలపై ఆంక్షలు ఉండేవని, ఇప్పుడు ఎవరైనా సీఎంను లేదా మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions