- భద్రాద్రి అభివృద్ధికి మూడు దశల్లో మాస్టర్ ప్లాన్.. !
Bhadrachalam Temple Development | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలు పట్టాలెక్కాయి.
శుక్రవారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి సమావేశమై ఆలయ ‘మాస్టర్ ప్లాన్’ పై సుదీర్ఘంగా చర్చించారు.
ఆగమ శాస్త్రం ప్రకారం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయ పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ పనులతో పాటు, నూతన పుష్కర ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రాచలం సమీపంలోని రామవరంలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ‘ట్రైబల్ మ్యూజియం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రాద్రిని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా (Spiritual Hub) తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రులు ప్రకటించారు.
ఇతర ఆలయాల అభివృద్ధి:
గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేవలం భద్రాచలమే కాకుండా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొరివి వీరభద్రస్వామి దేవాలయం మరియు మల్లూరు నరసింహస్వామి దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
త్వరలోనే ఈ మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నివేదించి, ఆయన సూచనల మేరకు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.






