BCCI Set To Demote Virat Kohli & Rohit Sharma To Grade B Category | బీసీసీఐ తీసుకోబోయే ఓ కీలక నిర్ణయం మూలంగా టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. A+, A, B మరియ C. అయితే సెంట్రల్ కాంట్రాక్టు సిస్టంలో సమూల మార్పులు చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధికారులను ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. A+ కేటగిరీని పూర్తిగా తొలగించి కేవలం ఏ, బీ, సీ కేటగిరీలనే ఉంచాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం ఆటగాళ్ల స్థాయి, పెర్ఫార్మన్స్ ఆధారంగా కేటగిరీని నిర్ణయిస్తారు. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా A+ లో కొనసాగుతున్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది. A కేటగిరీలోని వారికి రూ.5 కోట్లు, బీ లోని ప్లేయర్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీలోని వారికి రూ.కోటి చెల్లిస్తుంది బీసీసీఐ. ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్టు సిస్టంలో మార్పులు తీసుకువస్తే విరాట్, రోహిత్ పై ప్రభావం పడే అవకాశం ఉంది అని విశ్లేషణలు వస్తున్నాయి. టెస్టు, టీ-20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్ కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు. ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్టు సిస్టంలో మార్పులు వస్తే రో-కో జోడీ బీ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంది.









