Bangladesh approves shooting team’s India trip for Asian Air Gun Championship | ఢిల్లీలోని కర్ణీ సింగ్ రేంజ్ లో సోమవారం నుంచి ఆసియా రైఫిల్, పిస్టల్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ షూటర్లు రావడం దాదాపు ఖరారు అయ్యింది. టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా తమ దేశ జట్టు భారత్ కు రాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో షూటర్ల రాక ఆసక్తిగా మారింది. వరల్డ్ కప్ లో భారత్ వేదికగా జరిగే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బీసీబీ కోరిన విషయం తెల్సిందే.
ప్లేయర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని మ్యాచుల వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. దీనిపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో వరల్డ్ కప్ లో పాల్గొనేది లేదని బంగ్లా తేల్చి చెప్పింది. ఇదే సమయంలో బంగ్లా షూటర్లు భారత్ కు వస్తున్నారు. క్రికెట్ జట్టును భారత్ కు పంపించేందుకు నిరాకరించిన బంగ్లా షూటర్లను మాత్రం పంపిస్తుండడం గమనార్హం. బంగ్లా షూటర్ల వీసాల అనుమతికి విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపినట్లు జాతీయ రైఫిల్ సంఘం కార్యదర్శి రాజీవ్ భాటియా పేర్కొన్నారు.









