Nara Lokesh | నేపాల్‌లో (Nepal) రాజకీయ సంక్షోభం, ఆందోళనల కారణంగా రాజధాని ఖాట్మండులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగు వారితో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఫోన్ లో మాట్లాడారు.
ఏపీలోని మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మి సహా 8 మంది యాత్రికులు ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మండు ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న పశుపతి ఫ్రంట్ హోటల్‌లో ఉన్నారు. మంత్రి లోకేశ్‌తో వీడియో కాల్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమతో పాటు మరో 40 మంది తెలుగువారు కూడా అదే హోటల్‌లో ఉన్నట్లు వారు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.
నేపాల్‌లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు.
నేపాల్‌లో మొత్తం 241 మంది ఏపీకి చెందిన యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని వీలైనంత త్వరగా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.









