Anand Mahindra On Cm Revanth | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ ( Skill University )కి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra ) ఛైర్మన్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్ ( Cm Revanth ) ఆలోచన గొప్పదని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.
అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని కోరగానే అంగీకరించానని ఆనంద్ మహీంద్రా అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందన్నారు.
అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ ( US Consulate ) తెలంగాణలోనే ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తుచేశారు. ఇకనుంచి ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందని అనడంలో సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలనే ఆకాంక్షను ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు.