Union Home Minister Amit Shah inaugurate Turmeric Board headquarters in Nizamabad | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మరియు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మాట్లాడిన అమిత్ షా పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదన్నారు.
పసుపు రైతుల 40 ఏళ్ల కలను నెరవేర్చిన ఘనత ప్రధాని మోదీది అని చెప్పారు. తెలంగాణకు పసుపు బోర్డు రావడంతో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎంతో కృషి చేశారని, ఈ క్రమంలో పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా దానికి ఛైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమించినట్లు పేర్కొన్నారు.
తన చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పసుపు పంటకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు.
ఈ నేపథ్యంలో 2030 నాటికి బిలియన్ డాలర్ల పసుపు ఎగుమతి చేయాలన్నారు. అలాగే ఇక్కడి పసుపు పంటకు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.