- కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసా లేదు.. పెట్టుబడి సాయానికి దిక్కులేదు..
- బ్రేకులు లేని బస్సులా కాంగ్రెస్ పాలన.. వెంటనే రైతు బంధు, బోనస్, పంట నష్టం డబ్బులు విడుదల చేయాలి.
- మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao Slams Government | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) గురువారం సిద్దిపేట మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కందులకు రూ. 8,000 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతు సోదరులంతా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మన దేశంలో నూనె గింజలు, పప్పు దినుసుల కొరత ఉందనీ, అందుకే రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించి వరికి ప్రత్యామ్నాయంగా సన్ ఫ్లవర్, ఆయిల్ పామ్, పప్పు దినుసులు సాగు చేస్తే భూసారం పెరుగుతుంది, చీడపీడలు తగ్గుతాయి, అధిక లాభాలు వస్తాయని వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర సర్కార్ల పై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నేను తీవ్రంగా ఖండించారు.
“ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే రోజులొచ్చాయి. బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత పెట్టాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తోంది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీలో పూర్తిగా విఫలమైంది. పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఏనాడూ ఎరువులకు కొరత రాలేదు.
కరోనా వచ్చినా, నోట్లు రద్దయినా రైతులకు ఇబ్బంది రాలేదు. కానీ కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ ఎరువుల కోసం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి క్యూలైన్లలో చెప్పులు పెట్టి నిలబడే చీకటి రోజులను తీసుకువచ్చారు.
యూరియా దొరక్క రైతులు ప్రైవేటులో అధిక ధరలకు లిక్విడ్ ఎరువులు కొంటూ నష్టపోతున్నారు. ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు జాడ లేదు.
యాసంగి సాగు పనులు సాగుతున్నాయి. దుక్కి దున్ని, నాట్లు వేసి, కలుపు తీసి ఎరువులు వేసే సమయం ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ లోనే రైతు బంధు టింగు టింగుమని ఫోన్లలో మోగేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేదు.
రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఎంత ఇస్తారు? 15 వేలా? 12 వేలా? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే దానిపై స్పష్టత లేదు. రైతులు వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ఆ మిత్తీల భారం రైతుల మీదే పడుతోంది.
రైతులకు నీళ్లు బంద్.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు మాత్రం ఫుల్. ఇవాళ మెదక్ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు.. మొత్తం 70 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.
కారణం అడిగితే రిపేర్లు ఉన్నాయి, నీళ్లు లేవు అంటున్నారు. రైతులకు ఇవ్వడానికి లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్సైజ్ శాఖ కార్యదర్శి స్వయంగా వచ్చి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఆపొద్దు, ఫుల్ గా ఇవ్వండి అని ఆదేశాలు ఇస్తున్నారు.
మీకు రైతుల కంటే బీరు ఫ్యాక్టరీల ఓనర్లు ఇచ్చే లంచాలు, కమిషన్లే ముఖ్యమా? రైతులు లంచాలు ఇవ్వరని వారి పంటలను ఎండబెడతారా?
కేసీఆర్ పాలనలో ఎప్పుడూ క్రాప్ హాలిడే లేదు. మీకు బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు.
హెలికాప్టర్లో వచ్చి హామీలిచ్చారు.. పైసా విదల్చలేదు. పోయిన వానాకాలంలో వడగండ్ల వాన వల్ల పంట నష్టపోతే, ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి ఎకరానికి 10 వేలు ఇస్తామని చెప్పారు. ఏడాది గడిచింది..
ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు. మొన్నటి తుఫాను నష్టానికీ పరిహారం లేదు. బోనస్ పైసలు సగం మందికే ఇచ్చారు, మిగతా వారికి దిక్కులేదు. పోయిన యాసంగి బోనస్ 1100 కోట్లు పెండింగ్ ఉంది.
సివిల్ సప్లయ్ మంత్రికి, వ్యవసాయ మంత్రికి, ఆర్థిక మంత్రికి, చివరికి ముఖ్యమంత్రికి కూడా రైతుల గోడు పట్టడం లేదు.
మీకు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, సిట్ నోటీసులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు.
తక్షణమే రాజకీయ కక్ష సాధింపులు పక్కన పెట్టి..
1.పెండింగ్ లో ఉన్న రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి.
2.వానాకాలం, యాసంగికి సంబంధించిన పెండింగ్ బోనస్ డబ్బులు చెల్లించాలి.
3.వడగండ్ల వాన, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలి.
4.ఎరువుల కొరత లేకుండా చూడాలి.
లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాను.” అని వ్యాఖ్యానించారు హరీశ్ రావు.









